ఎగసిపడుతున్న అలలతో,,,ఉప్పాడ బీచ్ లో అలజడి నెలకొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను కొనసాగుతోంది. గంటకు 12 కిమీ వేగంతో మాండూస్ తీరం దిశగా పయనిస్తోంది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఏపీలోని కాకినాడ జిల్లాలో ఉప్పాడ బీచ్ వద్ద అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఉప్పాడ సముద్ర తీరంలో నీటిమట్టం పెరిగింది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాలు బీచ్ రోడ్డు వరకు దూసుకొస్తున్నాయి. తీరంలో ఈదురుగాలులు వీస్తున్నాయి. అలలు, ఈదురుగాలుల ఉద్ధృతి పెరగడంతో కాకినాడ-ఉప్పాడ బీచ్ రోడ్డులో రాకపోకలను నిషేధించారు. తిమ్మాపురం పోలీసులు, మెరైన్ పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అటు, అలల తాకిడి భారీగా పెరగడంతో మత్స్యకారులు బోట్లు, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.