గౌతమ్ అదానీ.. భారత్ సహా ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. అపర కుబేరుడు. ప్రపంచ కుబేరుల జాబితాలోనూ టాప్-3లో ఉన్నారు. అదానీ గ్రూప్‌కు చెందిన పలు కంపెనీలు ఈ ఏడాది భారీగా లాభపడ్డాయి. సంపద సృష్టిలో సరికొత్త శిఖరాలకు చేరాయి. దీంతో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని ఆయన కంపెనీలను వెనక్కినెట్టారు అదానీ. ముఖ్యంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్ 2022 సంవత్సరంలో వేర్వేరుగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను వెనక్కినెట్టడం గమనార్హం. 2017 నుంచి 2022లో ఇప్పటివరకు భారత్‌లో 100 కంపెనీలు రూ.99.2 లక్షల కోట్ల సంపదను సృష్టించాయట. ఈ మేరకు లీడింగ్ బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ నివేదికలో వెల్లడైంది. తన 27వ వార్షిక సంపద సృష్టి అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అయితే 2022లో మాత్రం రిలయన్స్ వెనుకబడ్డా.. ఐదేళ్లలో చూస్తే గనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానాన్ని నిలుపుకుంది. ఐదేళ్లలో సంపద సృష్టితో పోలిస్తే సంపద పతనం చాలా తక్కువగా ఉంది. 2017-22 మధ్య రూ.14 లక్షల కోట్ల సంపద పతనం అయిందంట. ఇది మొత్తం సంపద సృష్టిలో 16 శాతం. ఈ సంపద పతనం కంపెనీల్లో టాప్-10లో నాలుగు ప్రభుత్వ రంగ కంపెనీలు ఉండటం గమనార్హం. సంపద సృష్టిలో టెక్నాలజీ సెక్టార్ టాప్‌లో ఉండగా.. ప్రభుత్వ రంగ కంపెనీలు వరస్ట్ పెర్ఫామెన్స్ కనబరిచాయని మోతీలాల్ ఓస్వాల్ తన నివేదికలో వెల్లడించింది. ఈ సెక్టార్‌లో గుజరాత్ గ్యాస్ ఒక్కటే సంపద సృష్టించింది. అయితే ఇది మొత్తం సంపద సృష్టిలో 0.3 శాతం మాత్రమే.