ఆర్థిక మాంద్యంలోనూ బైకుల కొనుగోలు మాత్రం ఆగడంలేకపోగా అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయటా. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం రాబోతుందని భయాలు నెలకొన్నాయి. కొంతమంది ఆర్థిక సంక్షోభం మరో 6 నెలల నుంచి సంవత్సరంలో వస్తుందని, మరి కొందరేమో ఇప్పటికే మాంద్యం వచ్చిందని చెబుతున్నారు. వచ్చే ఏడాది వరకు మాంద్యం ప్రభావం ఉంటుందని ఇంకొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. కానీ ఇప్పుడు నవంబర్‌లో భారత్‌లో నమోదైన వాహన రిటైల్ విక్రయాల డేటాను చూస్తే.. అస్సలు మీరు ఆర్థిక మాంద్యం గురించి ఊసే ఎత్తరు. గత నెలలో రికార్డు స్థాయిలో వాహనాలు అమ్ముడైనట్లు వాహన పరిశ్రమ సమాఖ్య వెల్లడించింది. దీని ప్రకారం ఒక్క నెలలోనే ఏకంగా 18.5 లక్షల యూనిట్ల ద్విచక్ర వాహనాల విక్రయం జరిగింది. దీనిని బట్టి రూరల్ డిమాండ్ పెరిగిందని స్పష్టం అవుతోంది.
భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలోనే 2022 నవంబర్‌లో రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగినట్లు ఫాడా వివరించింది. టూవీలర్, ప్యాసింజర్, కమర్షియల్ వెహికిల్స్ ఇలా అన్ని సిగ్మెంట్లలో విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగినట్లు FADA తెలిపింది. గత నెలలో వాహన రిటైల్ విక్రయాలు మొత్తంగా 26 శాతం వృద్ధి కనిపించిందని వెల్లడించింది. టూ వీలర్ విక్రయాలు 24 శాతం పెరగ్గా.. 3 వీలర్ అమ్మకాలు 80 శాతం పెరిగినట్లు ఫాడా తెలిపింది. ఇక ప్రైవేట్ వాహనాలు, కమర్షియల్ వాహనాల విక్రయాలు వరుసగా 21, 33 శాతం పెరిగినట్లు పేర్కొంది.