ఉత్తర కొరియా దేశాధినేత చర్యలపై ప్రపంచ దేశాలే కాదు సొంత దేశ ప్రజల్లో కూడా వ్యతిరేకత నెలకొంటోంది. తాాజాగా ఆయన చర్యలు ప్రజల్లో ఆగ్రహాన్ని తెప్పించిన వాటిని బయటకు వ్యక్తంచేయలేని పరిస్థితి. ఓవైపు నియంత పాలన.. మరోవైపు ఆకలి కేకలతో నిత్యం నరకం అనుభవిస్తున్నా ఉత్తర కొరియా ప్రజలు. వారిపై జాలి చూపించడం తప్ప ప్రపంచం చేయగలిగింది ఏం లేదు. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ జారీ చేసిన ఉత్తర్వులు అతనిలోని మూర్ఖత్వానికి పరాకాష్టగా నిలుస్తున్నాయి. నియంతృత్వం రాజ్యమేలుతోన్న ఉత్తర కొరియాలో విచిత్రమైన నిర్ణయాలు, వింత నిబంధనలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రజలు ఏం తినాలో? ఎటువంటి బట్టలు వేసుకోవాలి? అనేది పాలకులే నిర్ణయిస్తారు. తాజాగా, పుట్టబోయే పిల్లలకు పెట్టే పేర్ల గురించి తల్లిదండ్రులకు అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హుకుం జారీచేసి మరోసారి వార్తల్లో నిలిచారు.
బాంబులు, తుపాకులపై తనకు ఉన్న అతి ప్రేమను దేశ ప్రజలపై ఆయన రుద్దుతున్నారు. తమ పిల్లలకు బాంబ్, గన్, శాటిలైట్ వంటి దేశభక్తి కలిగిన పేర్లను పెట్టాలని తల్లిదండ్రులను ఆదేశించారు. ఈ ఆదేశాలను పాటించకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇదే సమయంలో ఇప్పటికే పెట్టిన పేర్లను కూడా మార్చాలంటూ తల్లిదండ్రులను అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు దేశభక్తితో, సైద్ధాంతికంగా పేర్లు పెట్టాలని స్పష్టం చేశారు. ఇంతకుముందు దక్షిణ కొరియాలో ఉపయోగించిన పేర్లను పోలి ఉండే A Ri అంటే 'Loved One' Su Mi అంటే ‘Super Beauty’ వంటివి ఉత్తర కొరియాలోనూ అనుమతించారు.
తాజాగా, బాంబు, గన్, శాటిలైట్ వంటి కొత్త పేర్లు ఉండాలని కిమ్ జోంగ్ ఉన్ సూచించారు. పేర్లు మార్చకపోతే తల్లిదండ్రులు జరిమానాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. నియమాన్ని పాటించడంలో వైఫల్యానని సోషలిస్టు వ్యతిరేకంగా పరిగణించి జరిమానా విధించాలని కిమ్ నిర్ణయించినట్టు మిర్రర్ కథనం పేర్కొంది. Pok Il అంటే ‘బాంబు’, చుంగ్ సిమ్ అంటే ‘విధేయత’, యూ సాంగ్ అంటే ‘ఉపగ్రహం’ వంటి పేర్లను పిల్లలకు పెట్టాలని తల్లిదండ్రులకు ఆదేశించారు.
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. గతేడాది దివంగత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఇల్ పదో వర్ధంతి సందర్భంగా 11 రోజుల సంతాప దినాలు ప్రకటించారు. ఇందులో భాగంగా నవ్వడం, షాపింగ్ చేయడం, మద్యపానం నిషేధించినట్లు నివేదికలు వచ్చాయి. మద్యపానం, పుట్టిన రోజులు జరుపుకోకూడదు.. బహిరంగంగా నవ్వడానికి, ఏడవడానికీ వీల్లేదు. ఎటువంటి వేడుకలు నిర్వహించకూడదని, వాటిల్లో పాల్గొనకూడదని ఆదేశించారు. చివరికి ఇంట్లో ఎవరైనా చనిపోయినా కన్నీళ్లు పెట్టుకోవద్దని ఆర్డర్ వేశారు.