మారుతున్న పరిస్థితుల కారణంగా దక్షిణ కొరియాకు కొత్త సమస్య వచ్చి పడింది. అక్కడ యువత పెళ్లిళ్లు అంటే ఆమడ దూరం పారిపోతున్నారు. ఇదేంటని అనుకుంటున్నారా..? ముమ్మాటికి నిజం. అందుకే ఆ దేశంలో పెళ్లి చేసుకోని వారి సంఖ్య పెరిగిపోతుందంట. మరో 30 ఏళ్లలో దేశంలో సగం జనాభా పెళ్లి చేసుకోని వారే ఉంటారంట. విషయాన్ని ఆ దేశానికి సంబంధించిన ఓ సంస్థ చేసిన సర్వే వెల్లడించింది. ప్రపంచంలో అత్యంత తక్కువ సంతానోత్పత్తి రేటు నమోదు అవుతున్న దేశాల్లో దక్షిణ కొరియా దేశం కూడా ఒకటి.
ఇప్పటికే దక్షిణ కొరియాలో 72 లక్షల మంది యువత పెళ్లికి దూరంగా ఉన్నారు. ఈ సంఖ్య కొరియా మొత్తంలో ఉన్న కుటుంబాల్లో మూడో వంతు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఈ జనాభా 15.5 శాతంగా ఉండేది. క్రమక్రమంగా ఇది 30 శాతానికి చేరింది. ఇదే తంతు కొనసాగితే 2050 నాటికి 40 శాతానికి చేరుకుంటుందని సర్వే తెలియజేసింది. అప్పటికి ప్రతి ఐదుగురిలో ఇద్దరు సింగిల్‌గా ఉంటారంట.
దీనికి కారణం లేకపోలేదు. ఆ దేశంలో యువత కుటుంబ జీవనానికి దూరంగా ఉండాలనుకుంటున్నారు. అందుకే ఈ పరిస్థితి ఏర్పడిందని అక్కడ సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఆ దేశంలో రాబోయే రోజుల్లో సంతానోత్పత్తి మరింత తగ్గే అవకాశం కూడా ఉంది. జనాభా పరంగా చాలా తక్కువే అయినప్పటికీ... బ్రిటన్ స్థాయిలో సింగిల్స్ ఉన్నారు. జపాన్, జర్మనీ దేశాలతో పోల్చుకుంటే ఇది తక్కువే అయినా.. జనాభా నిష్పత్తి ప్రకారం చూసుకుంటే చాలా అధికం.