మాండస్ తుపాను బీభత్సం సృష్టించింది. తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు సమీప చెంగల్‌పట్టు, కాంచీపురం, విల్లుపురం జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. చెన్నై నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. 70 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల దాటికి, దాదాపు 400 వృక్షాలు నేలకూలాయి. దాదాపు 9 వేల మంది తుఫాను ప్రభావిత ప్రజలను రిలీఫ్ సెంటర్లకు తరలించారు. వర్షం సంబంధిత ఘటనల్లో ఆరుగురు మరణించారని, 181 ఇండ్లు ధ్వంసమయ్యాయని సీఎం ఎంకే స్టాలిన్ వెల్లడించారు. అధికారులు విరిగిపడిన చెట్లను తొలగించి, విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించే పనిలో ఉన్నారని తెలిపారు.