ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలోని ప్రముఖ రేవు పట్టణమైన ఒడెస్సాపై శుక్రవారం రాత్రి కామికాజీ డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో నగరంతోపాటు ఒడెస్సా రీజియన్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొత్తం 10 లక్షల మందికి పైగా అంధకారంలో చిక్కుకుపోయారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలంటే మరో వారం రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇరానియన్ డ్రోన్లతో రష్యా సైన్యం దాడులకు పాల్పడిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విమర్శించారు. డ్రోన్ దాడితో ఒడెస్సా రీజియన్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని, ఆస్పత్రులు, ప్రసూతి వార్డుల వంటి అత్యవసర విభాగాలకు మాత్రమే కరెంటు అందిస్తున్నామని చెప్పారు.