మాండస్ తుఫాన్ ప్రభావంతో శనివారం నెల్లూరు జిల్లా, ఆత్మకూరు ప్రాంతంలో ఈదురుగాలులతో ఎడతెరపి లేకుండా వర్షం కరుస్తుంది. దాంతో జనజీవనం స్తంభించింది. ఎలాంటి విపత్తు సంభవించిన తక్షణ చర్యలు చేపట్టేందుకు అధికారులు సన్నద్ధంగా ఉన్నారు. పెన్నా పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. ఆత్మకూరు మున్సిపాల్టీ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు నియోజకవర్గ పరిధిలో వాగులు, వంకలు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. పలు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్షాల కారణంగా పంట పొలాల్లో నీరు చేరాయి. సాగు చేసిన మిరప పొలాల్లో మొక్కలు నేలకొరిగాయి. ముసురుతో మినుము పంటకు వైరస్ సోకే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.