మాండూస్ తుపాన్ నష్టపరిహారం అంచనాల నమోదును వెంటనే ప్రారంభించాలని, వచ్చే వారంరోజుల్లో ఈ ప్రక్రియను ముగించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లు, ఉన్నతాధికారులను ఆదేశించారు. తుపాన్ ప్రభావం, భారీవర్షాలు, సహాయక చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్లు, అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ఎన్యుమరేషన్ విషయంలో ఉదారంగా ఉండాలన్నారు. ఎక్కడా కూడా రైతులు నిరాశకు గురికాకుండా చూసుకోవాలని చెప్పారు. రంగు మారిన ధాన్యం, తడిసిన ధాన్యం కొనుగోలు చేయలేదన్న మాట ఎక్కడా రాకూడదని, తక్కువ రేటుకు ధాన్యం కొంటున్నారన్న మాట కూడా ఎక్కడా వినిపించకూడదన్నారు. ఒకవేళ రైతులు బయట అమ్ముకుంటున్నా సరే.. వారికి అందాల్సిన రేటు కచ్చితంగా అందాల్సిందేనని, ఆ రేటు వచ్చేలా మనందరిపై ఉందని సూచించారు.