నేరచరితులు ఏ ఒక పార్టీకి పరిమితంకాలేదు. గుజరాత్ ఎన్నికల్లో ఇటీవల గెలిచిన వారిలో అన్ని పార్టీలలో నేరచరితులు ఉన్నారని తేలింది. గుజరాత్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన 182 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది నేరచరితులేనని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) తెలిపింది. ఎన్నికల అఫిడవిట్‌లో వారు దాఖలు చేసిన వివరాలను బట్టి ఏడీఆర్ ఈ వివరాలను వెల్లడించింది. నేరచరిత్ర కలిగిన 40 మందిలో 29 మందిపై తీవ్రమైన ఆరోపణలు ఉండగా, కొందరిపై అత్యాచారం, హత్య కేసులు కూడా ఉండడం గమనార్హం.
తీవ్రమైన నేరారోపణలు కలిగిన వారిలో అత్యధికంగా 20 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కాగా, కాంగ్రెస్‌కు చెందిన నలుగురు, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఇద్దరు, స్వతంత్రులు ఇద్దరు, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఒకరిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అలాగే, ఈ ఎన్నికల్లో బీజేపీ 156 స్థానాల్లో విజయం సాధించగా వీరిలో 26 మంది, కాంగ్రెస్ 17 స్థానాల్లో విజయం సాధించగా 9 మంది, 5 స్థానాల్లో విజయం సాధించిన ‘ఆప్’కు చెందిన ఇద్దరిపై నేరారోపణలు ఉన్నట్టు ఏడీఆర్ గణాంకాలు చెబుతున్నాయి.
అయితే, గత ఎన్నికల (2017)తో పోల్చుకుంటే మాత్రం నేర చరిత్ర కలిగిన ఎమ్మెల్యేల సంఖ్య కొంత తగ్గింది. అప్పట్లో 47 మంది నేరచరితులు అసెంబ్లీకి ఎన్నికైతే ఇప్పుడా సంఖ్య 40కి తగ్గింది. ఇక, హత్యారోపణలు ఎదుర్కొంటున్న వారిలో వన్సదా నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనంత్ పటేల్, పటాన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎన్నికైన పెనాల్ పటేల్, ఉనా నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎన్నికైన కౌలుభాయ్ రాథోడ్ ఉన్నారు. వీరు మూడుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడం గమనార్హం.