వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై నమోదైన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు తన తీర్పును వాయిదా వేసింది. ఈ అంశంపై సోమవారం వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందనరావు సోమవారం ఆదేశాలిచ్చారు. తమ కుమారుడి హత్య కేసులో అనంతబాబుపై నమోదైన కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరుతూ డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు వీధి నూకరత్నం, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు. ‘పోలీసుల దర్యాప్తు సరైన దిశలో సాగడం లేదు. వారి దర్యాప్తుపై నమ్మకం లేదు. మృతుడిని ఎమ్మెల్సీ తన కారులో తీసుకొచ్చి ఇంటి వద్ద అప్పగించినప్పుడు ఎమ్మెల్సీ భార్య కూడా కారులోనే ఉన్నారు. ఆమెను పోలీసులు ఇప్పటివరకు ప్రశ్నించలేదు. మృతుడి శరీరంపై మొత్తం 32 గాయాలు ఉన్నాయి. ఆ స్థాయిలో గాయపరచడం ఒక్క వ్యక్తితో సాధ్యం కాదు. కానీ ఆ దిశగా దర్యాప్తు చెయ్యడం లేదని ఆవేదన వ్యక్తపరిచారు.