రోడ్లపై పడిన గోతులు కూడా పూడ్చలేని జగన్‌రెడ్డి మూడు రాజధానులు నిర్మిస్తానని చెప్పడం హస్యాస్పదంగా ఉందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. తూర్పు గోదావరి జిల్లా, వేమగిరి సామర్లకోట కెనాల్ రోడ్డు దుస్థితిని నిరశిస్తూ అనపర్తిలోని గ్యాస్ గొడౌన్ సమీపంలో పార్టీ శ్రేణులతో కలిసి కెనాల్ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.... వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దోచుకోవడం మినహా ప్రజలకు ఉపయోగపడిందేమీ లేదని అన్నారు. నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉండగా రోడ్డు నిర్మాణం కోసం పాదయాత్రలు చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మూడున్నరేళ్లుగా కెనాల్ రోడ్డు నిర్మాణానికి ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాల్సిన రోడ్డుకు కేంద్ర మంత్రి నితిన్‌గడ్కారీకి వినతి పత్రం ఇవ్వడం ఏమిటో ఇప్పటికీ అర్థం కాలేదని అన్నారు. ఇప్పటికైనా కెనాల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించా లని డిమాండ్ చేశారు.