పూణేలో జనజీవనం స్థంభించినంతగా పరిణామాలు నెలకొంటున్నాయి. పూణెలో వ్యాపార, వాణిజ్య సంస్థల బంద్ జరుగుతుంది. పట్టణంలోని అన్ని షాపులు, విద్యా సంస్థలు మూతబడ్డాయి. ఛత్రపతి శివాజీ మహరాజ్‌పై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ బంద్ చేపట్టారు. ఎన్సీపీ, శివసేన (థాక్రే వర్గం) పిలుపు మేరకు బంద్‌ను చేపట్టారు. సర్వమత శివప్రేమి పుణెకర్, మరఠా సంస్థ శంభాజీ బ్రిగేడ్ పూణె బంద్‌కు మద్దతు తెలియజేశాయి.
ఆందోళనకారులు దక్కన్‌లోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం మౌన దీక్ష చేపట్టారు. బంద్‌లో భాగంగా అన్ని షాపులు, ఆఫీసులు మధ్యాహ్నం మూడు గంటల వరకు మూసి ఉంచనున్నారు. నిత్యావసర సేవల దుకాణాలు ఉదయం పది గంటల వరకు తెరవడానికి అనుమతించారు. మెడికల్ షాపులకు బంద్ నుంచి మినహాయించారు. పెట్రోల్, సీఎన్జీ బంకులు పని చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. అయితే ఈ నిరసనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగక్కుండా.. వంద మంది పోలీసులతో పాటు వెయ్యి మంది జవాన్లను మోహరించారు.
ఇదిలావుంటే నవంబర్ 19న ఔరంగాబాద్‌లో జరిగిన ఓ యూనివర్సిటీ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ.. శివాజీని పాత రోజులకు చిహ్నమని పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీలు నవయుగానికి ఐకాన్‌లుగా చెప్పారు. దీంతో శివాజీని అవమానించినట్లుగా ఎన్సీపీ, శివసేన భావించాయి. ఈ నేపథ్యంలో బంద్‌కు పిలుపునిచ్చాయి.