వివాహంలో ఇచ్చే కానుకలు ఎలావుంటాయో అందరికీ తెలుసు. కానీ ఓ సోదరుడు తన చెల్లికి పెళ్లి సమయంలో ఇచ్చిన కానుకలు మాత్రం చర్చాంశనీయంగా మారాయి. వివాహా సమయంలో వధువుకు కట్నకానుకల కింద ఆభరణాలు, నగదుతో పాటు సారె కింద విలువైన వస్తువులు అందజేయడం ఆనవాయితీ. కానీ, ఓ వధువుకు వినూత్నమైన సారె ఇచ్చాడు ఆమె సోదరుడు. సోదరి వివాహానికి జల్లికట్టు ఎద్దు, పొట్టేలు, పందెం కోడి, శునకం తదితరాలను సోదరుడు ఇచ్చిన ఘటన తమిళనాడులో జరిగింది. శివగంగై జిల్లా మానామదురై సమీపంలోని ఆవరంగడ్డకు చెందిన సురేష్- సెల్వి దంపతులకు కుమారుడు రాహుల్, కుమార్తె విరోష్మా ఉన్నారు. కుమార్తె విరోష్మాకు ధనశేఖర్ అనే యువకుడితో డిసెంబరు 10న వివాహం ఘనంగా నిర్వహించారు.
అయితే, సోదరి కోరిక మేరకు సారెగా జల్లికట్టు ఎద్దు, పొట్టేలు, పందెం కోడి, శునకాలను రాహులు ఇచ్చారు. చిన్నప్పటి నుంచి పాడి పశువుల సహా మూగజీవాలంటే విరోష్మాకు ఎంతో ఇష్టం కావడంతో పెళ్లి తర్వాత వాటినే సారెగా అందజేశారు. జంతు ప్రేమికురాలైన విరోష్మా తన సోదరుడు కానుకలను చూసి ఆనందంతో ఉబ్బితబ్బుబ్బి అయ్యింది. కళ్యాణ వేదికపైకి వాటిని తీసుకెళ్లి నూతన దంపతులు ఫొటోలు, వీడియోలు తీయించుకున్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రాహుల్‌కు కూడా జల్లికట్టు ఎద్దులు, శునకాలు, పందెం కోళ్లు, పొట్టేళ్లు వంటి దేశవాళీ పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. తన ఇంట్లో వివిధ పెంపుడు జంతువులను పెంచుకునేవాడు. అయితే, అతడు ఉద్యోగానికి వెళ్లపోతుండటంతో వాటిని సరిగ్గా చూసుకోవడం కుదరలేదు. దీంతో పెంపుడు జంతువులను అమ్మేశాడు. ఇంట్లోని పెంపుడు జంతువులను సోదరుడు విక్రయించడంపై విరోష్మా ఆవేదన వ్యక్తం చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తన చెల్లెలకు వివాహం సందర్భంగా కోడిపిల్లలు, కుక్కపిల్లలు, ఎద్దులను కొని సారెగా అందించి సంతోషపరిచాడు. ఇదిలావుంటే గుజరాత్‌లోనూ ఓ రైతు తన కుమార్తెకు వివాహ సమయంలో పాడి ఆవును బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే.