బస్సు స్టాప్ ల తరహాలో ఢిల్లీ విమానాశ్రయం ప్రయాణికులకు నరకయాతనగా మారుతోంది. విమానం ఎక్కేందుకు ప్రయాణికులకు అపసోపాలు పడాల్సి వస్తోంది. గంటలకొద్దీ వెయిటింగ్ చేయాల్సి వస్తోందని ప్రయాణికుల నుంచి కొంతకాలంగా ఫిర్యాదులు అందుతున్నాయి. దీనికి తోడు ఎయిర్‌పోర్టులోని ఓ భాగంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఫలితంగా ప్రయాణికులకు 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. ఈ విషయం తెలియని వారు విమానం మిస్ చేసుకొని ఇక్కట్లు పడుతున్నారు. మరోవైపు.. ‘ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పరిస్థితి’పై నెటిజన్లు మీమ్స్‌తో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ విమానాశ్రయానికి వచ్చేకంటే రైల్లో వెళ్లేది ఉత్తమం అని ట్వీట్ చేస్తున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు పరిస్థితి చేపల మార్కెట్ కంటే అధ్వాన్నంగా తయారైందని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు.
మరోవైపు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పరిస్థితి గురించి ‘ఇండిగో ఎయిర్‌లైన్స్’ తన ప్రయాణికులకు కొన్ని సూచనలు జారీ చేసింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి డొమెస్టిక్ ప్రయాణాలు చేయాల్సిన వారు కనీసం మూడున్నర గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని ఇండిగో సంస్థ సూచించింది. 7 కిలోగ్రామలు లోపు బరువుండే ఒకే బ్యాగ్‌తో వస్తే సెక్యూరిటీ క్లియరెన్స్ త్వరగా లభిస్తుందని పేర్కొంది.
చెక్-ఇన్, బోర్డింగ్‌కు అనుకున్నదాని కంటే ఎక్కువ సమయం పట్టొచ్చని ఇండిగో హెచ్చరించింది. ప్రయాణికులు వారి వెబ్ చెక్-ఇన్‌ను పూర్తి చేసుకొని రావాలని సూచించింది. ఎయిర్‌పోర్టు లోపల టెర్మినల్ 3కి చేరుకునేందుకు గేట్ నం.5, గేట్ నం. 6 మార్గాలను ఎంచుకోవాలని సూచించింది. ఈ మేరకు ఇండిగో తన ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. దేశంలోనే అతిపెద్దదైన ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో విమానాల సంఖ్యను తగ్గించారు. కొన్ని విమానాలను టెర్మినల్-3 నుంచి మళ్లించనున్నారు.