చైనా దుశ్చర్యను భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో చైనా బలగాలు వాస్తవాధీన రేఖను అతిక్రమించి భారత భూభాగంలోకి దూసుకొచ్చాయని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని ఏకపక్షంగా మార్చేందుకు చైనా ప్రయత్నించిందని వెల్లడించారు. తవాంగ్ సెక్టార్‌లో భారత్ - చైనా సైనికుల మధ్య నాలుగు రోజుల కిందట (డిసెంబర్ 9) చోటు చేసుకున్న ఘర్షణపై మంగళవారం లోక్‌సభలో ప్రకటన చేశారు రాజ్‌నాథ్ సింగ్. ఈ ఘటనపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వివరణ ఇచ్చారు.
భారత్ భూభాగంలోకి చైనా బలగాల అతిక్రమణను మన జవాన్లు ధైర్యంగా అడ్డుకున్నారని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. చైనా సైనికులు తిరిగి తమ పోస్ట్ వైపు వెళ్లిపోయేలా తిప్పి కొట్టారని వివరించారు. భారత బలగాలు దేశ సమగ్రతను కాపాడే విషయంపై కట్టుబడి ఉన్నాయని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని రక్షణ మంత్రి స్పష్టం చేశారు.
‘భారత్, చైనా జవాన్ల మధ్య డిసెంబర్ 9న ఘర్షణ జరిగింది. చైనాకు చెందిన పీఎల్‌ఏ జవాన్లు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాలను భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణల్లో ఇరువైపులా కొంత మంది సైనికులు గాయపడ్డారని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. భారత సైన్యంలో ఎవరూ మృతి చెందలేదని వివరించారు. ఎవరికీ తీవ్ర గాయాలు కూడా కాలేదన్నారు. సరైన సమయంలో కమాండర్ల జోక్యంతో పీఎల్‌ఏ సైనికులు వెనక్కి వెళ్లిపోయారని వివరించారు.
అయితే, తవాంగ్ ఘర్షణలో సైనికులు గాయపడ్డారని తెలిపిన రక్షణ మంత్రి.. ఎంత మంది గాయపడ్డారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ ఘర్షణలో 20 మంది సైనికులు గాయపడ్డారని ఆంగ్ల పత్రికల కథనాల్లో పేర్కొన్నారు. చైనా వైపు రెట్టింపు సంఖ్యలో గాయపడ్డారని రాశాయి. మంగళవారం ఉదయం తవాంగ్ ఘటనపై విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ ఉభయ సభలూ కాసేపు వాయిదా పడ్డాయి. తవాంగ్ ఘటనపై చర్చ జరపాలని లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌధరి, డీఎంకే నేత టీఆర్ బాలు, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేస్తారని తెలిపారు. అటు రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ఈ అంశాన్ని లేవనెత్తారు.