ఓ రైతు తన సమస్యపై వినూత్నంగా నిరసన చేపట్టాడు. తమ ఇంటిపై హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేలా అనుమతి ఇవ్వాలంటూ ఓ రైతు తన కుటుంబసభ్యులతో కలిసి కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. నిరసనలో భాగంగా ఓ బొమ్మ హెలికాప్టర్‌ను ప్రదర్శించారు. వాళ్లు ల్యాండింగ్‌కు అనుమతి కోరుతున్నది ఆ బొమ్మ హెలికాప్టర్‌కే. అవాక్కయ్యారా..? మీరు చదివింది కరెక్టే. గ్రామస్థులు ఆ రైతు కుటుంబానికి పిచ్చి లేపుతున్నారు. వాళ్లు తమ ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారట. బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తే.. ఇంటి చుట్టూ ప్రహారి గోడ కట్టేశారు. ఇక ఇంట్లోకి వెళ్లాలంటే.. హెలికాప్టర్‌లో ఇంటిపై దిగడమే వారికున్న ఏకైక దారి.
తమిళనాడులోని ధర్మపురిలో చోటు చేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గణేషన్ అనే రైతుకు గ్రామస్థులతో ఏం సమస్యో, ఏమో తెలియదు గానీ.. నాలుగు నెలలుగా వారు తమను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఇంట్లోకి కూడా వెళ్లనివ్వడంలేదని కలెక్టర్ వద్ద గోడు వెల్లబోసుకున్నారు.
సోమవారం (డిసెంబర్ 12) గణేషన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ధర్మపురి జిల్లా కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. చేతిలో వినతిపత్రం, బొమ్మ హెలికాప్టర్‌తో నిరసన చేశారు. తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు గణేషన్ ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డులో తన పేరు ‘దత్తా’కు బదులుగా ‘కుత్తా’ (కుక్క) అని పడటంతో పశ్చిమ బెంగాల్‌లో ఓ వ్యక్తి కలెక్టర్ ముందు కుక్కలా అరుస్తూ నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.