ఆమె ఖాకీ వనంలో తులసి మొక్క అని చెప్పవచ్చు. ఎందుకంటే ఓ మహిళా పోలీస్ ఆఫీసర్ ఒకరి ప్రాణం కాపాడారు. ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌లో మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తోన్న సోనమ్ పరాసర్ గుండెపోటుతో బాధపడుతున్న వృద్ధుడి ప్రాణాలను రక్షించారు. గుండె పోటుతో కళ్లు తేలేసిన ఆ వ్యక్తికి సకాలంలో సీపీఆర్ అందించారు. తర్వాత అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
గ్వాలియర్‌లో రోడ్డు పక్కన ఓ వృద్ధుడు పడిపోయాడు. కళ్లు తేలేశాడు. అటువైపు వెళ్లిన వారంతా అతనిని ముందు తాగుబోతు అనుకున్నారు. కానీ సబ్‌ఇన్‌స్పెక్టర్ సోనమ్ పరాసర్ మాత్రం అతని దగ్గరకు వెళ్లి పరిశీలించారు. అతడికి గుండె పోటు వచ్చినట్టు ఆమె గుర్తించారు. వెంటనే తన సహోద్యోగిని అంబులెన్స్‌కి కాల్ చేయమని చెప్పారు. తర్వాత అతనికి సీపీఆర్ చేయడం ప్రారంభించారు. అతని శ్వాస సాధారణం అయ్యే వరకు ఆమె సీపీఆర్ కొనసాగించారు. అనంతరం అపోలో ఆస్పత్రికి తరలించారు. దాంతో వైద్యులు చికిత్స అందించారు. దాంతో ఆయన ప్రాణాలు నిలబడ్డాయి.
సీపీఆర్ సకాలంలో చేయకపోతే గుండె పోటు చాలా తీవ్రంగా ఉండేదని, అతని జీవితాన్ని రక్షించడం చాలా కష్టమయ్యేదని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆ మహిళా పోలీసు అధికారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర కోశాధికారి అశోక్ సింగ్‌తో సహా బీజేపీ రాష్ట్ర మీడియా ఇంఛార్జ్ లోకేంద్ర పరాసర్ ఆ మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.