ఉక్రెయిన్ పై రాజీలేని పోరాటం చేస్తున్న రష్యా దేశాధినేత వ్లాదిమిర్ పుతిన్ బంకర్ లోకి జారుకొన్నారు. రష్యాలో స్వైన్ ఫ్లూ విజృంభించడంతో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఐసోలేషన్ కోసం బంకర్‌లోకి వెళ్లిపోనున్నారని మెట్రో నివేదిక తెలిపింది. ఈ ఏడాది తన వార్షిక ముగింపు మీడియా సమావేశాన్ని పుతిన్ నిర్వహించడం లేదని అధికారులు ప్రకటించిన మర్నాడే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. సంప్రదాయంగా వస్తున్న వార్షిక ముగింపు మీడియా సమావేశం రద్దుకు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఎటువంటి కారణాలు వెల్లడించలేదు. దీంతో పుతిన్ ఆరోగ్య సమస్యల కారణంగా మీడియా సమావేశం రద్దయ్యిందని అనేక పత్రికలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించిన తర్వాత పుతిన్ ఆరోగ్యంపై అనేక కథనాలు, వదంతులు వ్యాప్తిలోకి వచ్చిన విషయం తెలిసిందే.
రష్యా వార్తా సంస్థ టాస్ ప్రకారం.. కేంద్ర వినియోగదారుల హక్కులు, మానవ సంరక్షణ హెడ్ అన్నా పొపొవా వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఈ ఏడాది H1N1 flu వైరస్ దేశంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. రోషియా-1 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పొపొవా మాట్లాడుతూ.. ‘‘అవును, ఈ సంవత్సరం ఫ్లూ వ్యాప్తిలోకి వచ్చింది.. ఈ పరిస్థితిలో అత్యంత భయంకరర విషయం ఏమిటంటే ఇది ఖచ్చితంగా ఆరోగ్యానికి అత్యంత తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది.. ఇది 2009 మహమ్మారి సంవత్సరానికి చెందిన ఫ్లూ A వైరస్ (H1N1).. అధిక వ్యాప్తి కలిగిన ఈ ఫ్లూ 2009లో మొదటిసారిగా వెలుగులోకి వచ్చి 2009-2020 మహమ్మారికి కారణమయ్యింది’’ అని అన్నారు.
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అధ్యక్షుడ్ని రష్యా అధికారులు ప్రజలకు దూరంగా ఉంచుతున్నట్టు మెట్రో నివేదిక పేర్కొంది. చాలా మంది అధికారులు ఫ్లూ బారిన పడటంతో రష్యా పార్లమెంట్ ఎగువ సభలో తన ప్రసంగాన్ని విరమించుకోవాలని పుతిన్ భావిస్తున్నారని తెలిపింది. ఇదిలా ఉండగా, రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించే ది జనరల్ ఎస్వీఆర్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉరల్ పర్వతాల్లోని తూర్పు ప్రాంతంలో ఏర్పాటుచేసిన బంకర్‌లో కొత్త ఏడాది రోజున తన ప్రియురాలు అలీనా కబయేవాతో పుతిన్ గడపనున్నారని చెప్పింది. అదే సమయంలో వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ప్రజలు మార్గదర్శకాలను పాటించాలని పొపొవా కోరారు. మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడంతో పాటు వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యలను అనుసరించాలని సూచించారు. అంతేకాదు, ఏదైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే ఇళ్లలోనే ఉండాలని పేర్కొన్నారు. ఇటు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కరోనా విషయంలో అలసత్వం వద్దని తాజాగా హెచ్చరించింది.