అపుడపుడు పులుల సంచారంతో తిరుమల కొండ అలజడి మొదలయ్యేది. కానీ ఇపుడు కొండపై కొండ చిలువ దర్శనమిచ్చింది. తిరుమలలో ఓ భారీ కొండ చిలువ హల్‌చల్ చేసింది. తిరుమల జీఎన్సీ టోల్ గేట్ సమీపంలో ఉన్న దివ్యరామంలో.. సుమారు 10 అడుగుల ఎత్తు ఉన్న భారీ కొండచిలువ కనిపించింది. దీంతో ఉద్యానవనంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కూలీలు పరుగులు తీశారు. వెంటనే తిరుమల స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న భాస్కర్ నాయుడు.. ఘటనా స్థలానికి చేరుకొని పైతాన్ పామును చాకచక్యంగా పట్టుకున్నారు. తాను తెచ్చుకున్న కాటన్ సంచిలో బంధించి.. అవ్వాచరి కోనలో వదిలిపెట్టారు. దీంతో అక్కడి ఉద్యోగులు, కూలీలు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే.. మాండొస్ తుఫాను కారణంగా తిరుమలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో కొండల్లోని చాలా ప్రాంతాలు నీటితో నిండాయి. ఫలితంగా పాములు, ఇతర జంతువులు బయటకు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడే కాదు.. గతంలోనూ చాలాసార్లు పాములు బయటకు వచ్చాయి. భక్తులను భయపెట్టాయి. కొన్నిసార్లు షాపుల్లోకి కూడా దూరాయి. అటు.. పాములు కనిపించిన ప్రతీసారి.. స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఆపద్భాందవుడిలా ఆదుకుంటున్నారు. సమాచారం ఇచ్చిన వెంటనే వచ్చి పాములను పట్టుకొని సురక్షిత ప్రాంతాల్లో వదిలేస్తున్నారు.