జీతాలు, పెన్షన్ల కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు రోడ్డుపైకి వచ్చిన రోజు ఉందా? కానీ చరిత్రలో మొదటిసారిగా ఇవాళ రోడ్డుపైకి వచ్చారు అని ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం చేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు.
"బకాయిలు అడగకూడదనే కావాలని జీతాలు ఆలస్యం చేస్తున్నారా? ప్రభుత్వం ఈ విధంగా ఆలోచిస్తోందేమో మాకు అర్థం కావడంలేదు. మా కుటుంబ అవసరాల కోసం వేల కోట్లు దాచుకుంటే వాటి నుంచి కొంత మొత్తంలో ఇవ్వడానికి కూడా సంవత్సరాల తరబడి ఎందుకు జాప్యం చేస్తున్నారు? పదవీ విరమణ చేసిన ఉద్యోగికి పదవీ విరమణ రోజే పెన్షన్ తో పాటే తనకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఇచ్చేసి, సన్మానం చేసి కారులో ఇంటికి పంపించమన్నారు. ఇవి ప్రభుత్వ నిబంధనల్లోనే ఉన్నాయి. కానీ నేడు సంతోషంగా ఇంటికి వెళ్లే పరిస్థితి లేదు. ఒక్క రూపాయి కూడా రావడంలేదు... అసలు, రిటైర్ అవుదామంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.
2018 జులై నుంచి మా జీతాల నుంచి రావాల్సిన డీఏ అరియర్స్ అడుగుతున్నాం. ఇచ్చినట్టే ఇచ్చారు... ఇన్ కమ్ టాక్స్ కట్ చేయించి మళ్లీ వెనక్కి తీసుకున్నారు. ఉద్యోగుల వద్దే కాదు, పెన్షనర్ల వద్ద కూడా ఇన్ కమ్ టాక్స్ కోత విధించి వెనక్కి తీసుకున్నారు. ఈ రోజుకు ఒక్క కొత్త డీఏ కూడా లేదు. పీఆర్సీ ప్రకటించారే కానీ, ఒక్క రూపాయి కూడా పీఆర్సీ అరియర్స్ ఇవ్వలేదు.
ఉద్యోగులకు ఇబ్బంది కలగని రీతిలో సీపీఎస్ రద్దు చేస్తామన్నారు, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్నారు. కానీ ఆ హామీలు కార్యరూపం దాల్చడంలేదు. ప్రభుత్వం ఇదేవిధంగా వ్యవహరిస్తే వచ్చే నెలలో సంక్రాంతి తర్వాత ప్రత్యక్ష ఉద్యమానికి దిగుతాం" అని బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయమనే తాము కోరుతున్నామని, అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.