ట్విట్టర్ ఇంకా కుదురుకొన్నట్లుగానే కనిపిస్తోంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కొనుగోలు చేశాక ట్విట్టర్ కుదుపులకు గురైంది. సంస్థాగత మార్పులతో పాటు, సేవల పరంగానూ ట్విట్టర్ ఇంకా కుదురుకున్నట్టు కనిపించడంలేదు. తాజాగా, నార్వే ప్రధాని, విదేశాంగ మంత్రి విషయంలో ట్విట్టర్ తప్పిదానికి పాల్పడింది. నార్వే ప్రధాని జోనాస్ స్టోర్, విదేశాంగ మంత్రి అనికెన్ హ్యూయిట్ ఫెల్ట్ లను నైజీరియా దేశస్థులుగా పేర్కొంది. నైజీరియా ప్రభుత్వ అధికారులు అని, నార్వే విదేశాంగ మంత్రిత్వ శాఖను నైజీరియా ప్రభుత్వ సంస్థ అని తెలిపింది.
ట్విట్టర్ నిర్వాకాన్ని గుర్తించిన నార్వే విదేశాంగ మంత్రిత్వ శాఖ వెంటనే చురక అంటించింది. "నార్వే, నైజీరియా... ఈ రెండు దేశాల పేర్లు ఆల్ఫాబెట్ ప్రకారం సన్నిహితంగా ఉండడమే కాదు, నిజంగానే రెండు దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలు ఉన్నాయి. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను ఎంతగానో ఆస్వాదిస్తున్నాం. డియర్ ట్విట్టర్... ఇక మమ్మల్ని నార్వే దేశస్థులుగా పేర్కొంటే ఎంతో సంతోషిస్తాం. అంతేకాదు, ప్రధాని జోనాస్ స్టోర్, విదేశాంగ మంత్రి అనికెన్ హ్యూయిట్ ఫెల్ట్ లకు కూడా ఇది వర్తింపజేస్తారని ఆశిస్తున్నాం" అంటూ ట్వీట్ చేసింది.