మన సొంత వైద్యానికంటే డాక్టర్ ను సంప్రదించడం కొన్నిట్లో ఉత్తమం. ఇలా సొంత వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చి ఓ మహిళా ప్రాణాలను కోల్పోయింది. వైద్యుడి సలహా తీసుకోకుండా అబార్షన్ మాత్రలు వేసుకున్న వివాహిత మృతిచెందిన విషాదకర ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఆస్పత్రికి వెళ్దామని భర్త గొడవపడినా ఆమె మాత్రం సొంతంగా మాత్రలు తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఓ ఈ-కామర్స్ సంస్థలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రీతి కుష్వాహ (33), సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన ఆమె భర్త దేవ్‌వ్రత్ బెంగళూరులోని మైకో లేఅవుట్‌లో నివాసం ఉంటున్నారు. ప్రీతి ఇంటి వద్ద శనివారం ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌తో పరీక్ష చేసుకోగా పాజిటివ్ వచ్చింది. అయితే, అప్పటికే 11 నెలల బాబు ఉండటంతో అప్పుడే రెండో సంతానం వద్దునుకుంది.
తాను అబార్షన్ చేయించుకుంటానని భర్తకు చెప్పడంతో ఆయన సరే అన్నాడు. మెడికల్ షాపు నుంచి అబార్షన్ మాత్రలను తీసుకురమ్మని చెబితే భర్త వద్దన్నాడు. డాక్టర్ దగ్గరకు వెళ్లి అబార్షన్ చేయించుకుంటే మంచిదని సూచించినా ఆమె మాత్ర వినిపించుకోలేదు. ఇరువురి మధ్య గొడవ జరగడంతో ప్రీతి నిరాశకు గురయ్యింది. ఆమే స్వయంగా మెడికల్ షాపుకి వెళ్లి మాత్రలను కొనితెచ్చి వేసుకుంది. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో వాకింగ్‌కు వెళ్లిన దేవవ్రత్‌కు ప్రీతి ఫోన్ చేసి తనకు రక్తస్రావం ఎక్కువగా అవుతుందని చెప్పింది.
దీంతో అతడు వెంటనే ఇంటికి చేరుకోవడంతో ఆమె అబార్షన్ మాత్రలు వేసుకున్నట్లు చెప్పింది. అప్పుడు కూడా ఆస్పత్రికి వెళ్దామని భర్త బతిమాలినా మొండిగా ప్రవర్తించి ప్రాణాలు పోగొట్టుకుంది. ప్రీతి తమ్ముడు నవనీత్ సంభవ్‌కు దేవ్‌వ్రత్ ఫోన్ చేసి జరిగిన విషయం తెలియజేశాడు. అక్క పరిస్థితి తెలిసి అక్కడకు చేరుకున్న సంభవ్.. ఆస్పత్రికి వెళ్దామని అన్నా అప్పుడు కూడా ససేమిరా అంది. దీంతో అతడు ఇంటికి వెళ్లిపోయాడు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ప్రీతి పరిస్థితి విషమించడంతో భర్త ఆస్పత్రికి తరలించాడు. అయితే, అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించాడు.