అందుబాటులోకి వచ్చిన సాంకేతికత దొంగలను ఇబ్బందులను గురిచేస్తోంది. షాపులో మొబైల్ ఫోన్లను తస్కరించడానికి దొంగ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. దీంతో చివరకు చేసేది లేక ఆ ఫోన్‌ను షాపులో తిరిగి ఇచ్చేశాడు. ఇలాంటిదే ఏదో జరుగుతుందనే ముందు ఊహించిన యజమాని.. డోర్ లాకింగ్ వ్యవస్థను ఏర్పాటుచేయడంతో దొంగ ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే, ఆ షాపులో ఇలాంటి ఏర్పాటు ఉందని తెలియని దొంగ మొబైల్ ఫోన్‌ను తీసుకుని పరుగు లంఖించుకున్నాడు. కానీ, ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్ వల్ల అది తెరుచుకోకపోవడంతో కాలుకాలిన పిల్లిలా వెనక్కి వచ్చి ఇబ్బందికరంగా ఫోన్‌ను తిరిగి ఇచ్చేశాడు. బ్రిటన్‌లోని డ్యూస్‌బరీలో డిసెంబరు 4న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
1,600 పౌండ్ల విలువైన మొబైల్ ఫోన్‌లను దొంగిలించాలనే దొంగ ప్లాన్ అద్భుతంగా బ్యాక్‌ఫైర్ అయ్యింది. ఫోన్‌లను తిరిగి ఇచ్చి, తలుపు తెరవమని యజమానిని వేడుకున్నాడు. వెస్ట్ యార్క్‌షైర్ డ్యూస్‌బరీ పట్టణం ఫోన్ మార్కెట్ షాపులోకి డిసెంబరు 4 సాయంత్రం 4 గంటల సమయంలో ఓ యువకుడు వచ్చాడు. ఫోన్ కొనడానికి వచ్చిన కస్టమర్‌లా నటించాడు.
కౌంటర్ వెనుక ఉన్న దుకాణదారుడు కొన్ని ఫోన్‌లను చూపించి, పరిశీలించమని చేతికి మరో మొబైల్ ఇచ్చాడు. దీంతో వెంటనే ఆ ఫోన్‌ను తీసుకుని దొంగ ముందుకు పరుగెత్తాడు. కానీ, దుకాణదారుడు అతడ్ని వెళ్లకుండా నిరోధించి రిమోట్‌తో తలుపును లాక్ చేశాడు. ఈ చర్యతో తిరిగి వెనక్కి వచ్చి మొబైల్ అప్పగించి తనను వదిలేయని ప్రాధేయపడ్డాడు.
షాపు ఓనర్ అఫ్జల్ అదమ్ (52) మెట్రో న్యూస్‌తో మాట్లాడుతూ.. 250 పౌండ్ల ఖర్చుపెట్టి 2020లో ఆటోమేటిక్ డోర్ లాకింగ్ వ్యవస్థను ఏర్పాటుచేసినట్టు తెలిపాడు. ముఖం కనిపించకుండా మాస్క్‌లు ధరించి దుకాణంలోకి చొరబడి ఎవరైనా ఫోన్లు దొంగిలిస్తే గుర్తించడం ఇబ్బంది అవుతుందని భావించానని తెలిపారు. ఈ వ్యవస్థ లేకపోయి ఉంటే దొంగ 1,600 పౌండ్ల విలువైన ఫోన్లను ఎత్తుకెళ్లిపోయేవాడు అని చెప్పారు. మరొక స్థానిక దుకాణం యజమాని మా దగ్గరకు వచ్చిన ఇటువంటి లాకింగ్ వ్యవస్థ గురించి వివరాలను అడిగాడని పేర్కొన్నారు.