అమెరికాలో ఓ భారతీయుడు తన ప్రాణాలను తానే తీసుకొన్నాడు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రముఖ గోల్డెన్ గేట్ వంతెన పైనుంచి దూకి భారతీయ అమెరికా టీనేజర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలుడి తల్లిదండ్రులు, అమెరికా కోస్టల్ గార్డ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వంతెన వద్ద బాలుడి సైకిల్, మొబైల్ ఫోన్, బ్యాగును గుర్తించారు. ప్రస్తుతం బాలుడు 12వ తరగతి చదువుతున్నట్టు తెలిపారు. వంతెనపై నుంచి ఎవరూ దూకినట్టు ధ్రువీకరించిన తర్వాత వెంటనే రెండు గంటలపాటు నదిలో గాలించి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినట్లు కోస్టల్ గార్డ్స్ చెప్పారు. బాలుడు ప్రాణాలతో ఉండే అవకాశం చాలా తక్కువేనని పేర్కొన్నారు.
భారతీయ అమెరికన్ కమ్యూనిటీకి చెందిన జైన్ భూటోరియా మాట్లాడుతూ.. భారత సంతతికి చెందిన వ్యక్తులు గోల్డెన్ గేట్ వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన నాలుగో ఘటన ఇది అని అన్నారు. బ్రిడ్జ్ రైల్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వద్ద ఆత్మహత్యలను నిరోధించే విషయంలో పనిచేస్తోంది. గతేడాది ఇక్కడ 25 మంది ఆత్మహత్య చేసుకున్నారని, 1937లో వంతెన ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 2,000 ఆత్మహత్య ఘటనలు జరిగినట్టు బ్రిడ్జ్ రైల్ ఫౌండేషన్ తెలిపింది.
వంతెన వద్ద ఆత్మహత్యలను నివారించడానికి ఇరువైపులా 20 అడుగుల ఎత్తులో ఇనుప కంచెను కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. ఇది ఈ ఏడాది జనవరిలోనే పూర్తికావాల్సి ఉన్నా.. నిర్మాణ వ్యయం పెరగడంతో జాప్యం జరిగింది. 2018లో ప్రాజెక్ట్ ప్రారంభించే సమయంలో 137.26 మిలియన్ యూరోలు అవుతాయని అంచనా వేయగా.. ప్రస్తుతం 386.64 మిలియన్ యూరోలకు పెరిగింది.