తనను తాను అత్యుత్తమ పెట్టుబడిదారుగా భావిస్తాను అని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి వెల్లడించారు. ఇదిలావుంటే 40 ఏళ్ల కిందట కేవలం 350 డాలర్ల పెట్టుబడితో ప్రారంభమైన ఇన్ఫోసిస్ ప్రస్తుతం వేల కోట్ల సామ్రాజ్యంగా ఎదిగింది. అయితే, ఈ సంస్థలో తొలి పెట్టుబడి నారాయణ మూర్తి భార్య సుధామూర్తిదే కావడం మరో విశేషం. తన భర్తకు రూ. 10 వేలు రుణం ఇవ్వడం ద్వారా ఇన్ఫోసిస్‌లో మొదటి పెట్టుబడిదారు అయ్యారు. తనను తాను ప్రపంచంలో లేదా కనీసం భారత్‌లోనే అత్యుత్తమ పెట్టుబడిదారుగా ఆమె భావిస్తారు. భార్య దగ్గర అప్పుగా తీసుకున్న ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టిన నారాయణమూర్తి నాలుగు దశాబ్దాల్లోనే దానిని 17.53 బిలియన్ల డాలర్ల (రూ.17 వేల కోట్లు) కంపెనీ స్థాయికి తీసుకొచ్చారు.
ఇన్ఫోసిస్ 40 వ వార్షికోత్సవం సందర్భంగా ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సుధామూర్తి మాట్లాడుతూ.. అప్పుడు నేను ఇచ్చిన రూ. 10,000 తర్వాత బిలియన్ డాలర్లు అవుతుందని కలలో కూడా ఊహించలేదు కాబట్టి చాలా చాలా సంతోషంగా ఉన్నాను అని వ్యాఖ్యానించారు. ‘‘నన్ను నేను ప్రపంచంలోనే లేదా కనీసం భారత్‌లోనే అత్యుత్తమ పెట్టుబడిదారుగా భావిస్తాను’’ అన్నారు. ఆటంకాలు అన్నింటిని అధిగమించి, సొంతంగా కంపెనీని ప్రారంభించాలనుకునే వారికి సుధా మూర్తి సలహాలు ఇచ్చారు.
‘‘ఈ తరానికి ఓపిక ఉండాలి అని నేను అనుకుంటున్నాను.. ఒక్క రోజులో ఏమీ జరగదు.. రోమ్ నగరం ఒక రోజులో నిర్మాణం జరగలేదు.. ఒక కంపెనీని నిర్మించడానికి మీరు కష్టపడి పనిచేయాలి.. అవన్నీ చాలా అవసరం ... కానీ అవసరమైన పరిస్థితిలో నువ్వు ఓపిక పట్టాలి.. ఇన్ఫోసిస్ ప్రారంభించిన ఏడాదిలోనే మేము విజయం సాధించలేదు.. ఏడు-ఎనిమిదేళ్ల కష్టపడిన తర్వాత ఫలితం వచ్చింది.. కాబట్టి ఓపికపట్టండి.. కష్టపడి పని చేయండి.. విజయం దానంతట అదే వస్తుంది. మీరు డబ్బు కోసం పరిగెత్తితే, డబ్బు మీ నుంచి పారిపోతుంది. మీరు మంచి కారణం కోసం పరుగెత్తి, కష్టపడి పని చేస్తే విజయం దక్కుతుంది’’ అని సుధామూర్తి అన్నారు.
తన అల్లుడు, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ గురించి కూడా సుధామూర్తి మాట్లాడారు. ‘‘ఆయన ప్రధాని అయ్యారు.. చాలా సంతోషం.. అంతకంటే మాకు ఎక్కువ ఏమీ లేదు’’ అని వ్యాఖ్యానించారు. బ్రిటన్‌లో తన అల్లుడు పనితీరు నచ్చిందా లేదా అనేదానిపై చమత్కరంగా ‘నేను నా స్వంత దేశం విషయాలను చూసుకుంటాను.. అతను తన దేశం గురించి చూసుకుంటాడు’ అని సమాధానం ఇచ్చారు. ఆయనతో మాట్లాడేటప్పుడు రాజకీయపరమైన అంశాలు మాట్లాడుతారా? అంటే ‘లేదు, ఎప్పుడూ లేదు’ అని బదులిచ్చారు.
దేశంలోని తొలి కంప్యూటర్ షేరింగ్ సిస్టమ్ కోసం పనిచేసిన నారాయణ మూర్తి.. ఈసీఐఎల్ కోసం బేసిక్ ఇంటర్‌ప్రిటర్‌ను రూపొందించారు. సాఫ్ట్రోనిక్స్ పేరిట మొదట ఓ సంస్థను ప్రారంభించిన మూర్తి.. ఆ సమయంలోనే సుధా మూర్తితో ప్రేమలో పడ్డారు. నష్టాలు రావడంతో ఏడాదిన్నర తర్వాత ఆ సంస్థను మూసివేయాల్సి వచ్చింది. ఉద్యోగం చేస్తేనే తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని సుధామూర్తి తండ్రి షరతు విధించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పుణేలోని ప్యాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్‌లో జనరల్ మేనేజర్‌గా చేరారు. 1981లో ఉద్యోగం మానేసిన మూర్తి.. భార్య దగ్గర రూ.10 వేల తీసుకొని ఇన్ఫోసిస్‌ను ప్రారంభించారు. ఐదేళ్లు తిరిగేసరికే.. ఇన్ఫోసిస్ పెద్ద సంస్థగా అవతరించి.. 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగింది. ఊహించిన రీతిలో దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థగా రూపొందింది.