మనదేశంలో ధూమపానానికి ఎంతో మంది బలవుతున్నారు. ఈ నేపథ్యంలో ధూమపాన ప్రియులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఝలక్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. ఇక నుంచి విడిగా విడిగా సిగరెట్ల అమ్మకంపై నిషేధం విధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేసింది. 2023- 24 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి ముందే పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడానికి చర్యలు చేపట్టనుందని నివేదికలు పేర్కొన్నాయి. విడిగా సిగరెట్లు అమ్మకం, విమానాశ్రయాల్లో స్మోకింగ్ జోన్లపై నిషేధం విధించే అవకాశం ఉందని తెలిపాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 ఫిబ్రవరి 1న 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందే పొగరాయళ్లకు కేంద్రం షాకిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధూమపానం కారణంగా దేశంలో ఏటా 3.5 లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పొగాకు వినియోగం నియంత్రణ చర్యల్లో భాగంగా విడిగా సిగరెట్ల విక్రయాలు జరగకుండా నిషేధం విధించాలని స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది.
ఇప్పటికే పొగాకు ఉత్పత్తులపై అత్యధికంగా 28 శాతం జీఎస్టీ, 290 శాతం వరకు ఎక్సైజ్ సుంకం కేంద్రం విధించింది. అయినా ఈ చర్యలు అంతగా ప్రభావం చూపలేదని, ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది. మొత్తంగా సిగరెట్లపై 64 శాతం పన్నులు అమల్లో ఉన్నా విక్రయాలు, వాడకంలో ఏ మాత్రం తగ్గుదల నమోదు కాలేదు. ఇదే సమయంలో సిగరెట్లపై పన్నును 75 శాతానికి పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కోరింది. అయితే, కేవలం పన్నులు పెంచడం మాత్రమే సరిపోదని స్టాండింగ్ కమిటీ పేర్కొంది. కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు ఈ-సిగరెట్ల అమ్మకం, వినియోగాన్ని 2019లో నిషేధించారు.
అటు, విమానాశ్రయాల్లో స్మోకింగ్ జోన్లపై నిషేధం విధించాలని స్టాండింగ్ కమిటీ సూచించింది. గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా, ఐటీసీ, వీఎస్టీ ఇండస్ట్రీస్ నుంచి సిగరెట్ ప్యాకెట్లను వినియోగదారులు బలవంతంగా కొనుగోలు చేయాల్సి వస్తుండటం పొగాకు పరిశ్రమకు లాభసాటిగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.