ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐక్యరాజ్యసమితిలో ఉపన్యాసం చేసే అర్హత వారికి లేదు: దేశాంగ మంత్రి ఎస్ జైశంకర్

national |  Suryaa Desk  | Published : Fri, Dec 16, 2022, 12:05 AM

ఐక్యరాజ్యసమితిలో ఉపన్యాసం చేసే అర్హత వారికి లేదు అంటూ పాకిస్తాన్ కు కౌంటర్ ఇచ్చారు మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. ఐక్యరాజ్యసమితిలో మరోసారి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన దాయాది పాకిస్థాన్‌కు.. దానిని సమర్ధించి పొరుగు దేశం చైనాలకు భారత్ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చింది. అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌, పొరుగు దేశం పార్లమెంటుపై దాడికి పాల్పడిన దేశానికి ఐక్యరాజ్యసమితిలో ఉపన్యాసం చేసే అర్హత లేదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాక్‌పై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం మహమ్మారి వ్యాప్తి, వాతావరణ మార్పు, సంఘర్షణలు లేదా ఉగ్రవాదం వంటి కీలక సవాళ్లకు ప్రభావవంతమైన ప్రతిస్పందనపై ఐరాస విశ్వసనీయత ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు.


ఐరాస భద్రతా మండలి (UNSC)లో ‘అంతర్జాతీయ శాంతి, భద్రత, సంస్కరించిన బహుపాక్షికత కోసం కొత్త ధోరణి’ అనే అంశంపై గురువారం జరిగిన బహిరంగ చర్చకు భారత్ నాయకత్వం వహించింది. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ.. ఉగ్రవాదం సవాల్‌పై ప్రపంచం మరింత బాధ్యతతో కలిసి వస్తోందన్నారు.


‘‘బహుపాక్షికతను సంస్కరించే ఆవశ్యకతపై మనం ఈ రోజు స్పష్టంగా దృష్టి సారిస్తున్నాం.. మేము సహజంగానే మా ప్రత్యేక అభిప్రాయాలను కలిగి ఉన్నాం.. అయితే ఇది ఇంకా ఆలస్యం కాకూడదనే అభిప్రాయం పెరుగుతోంది.. మనం ఉత్తమ పరిష్కారాల కోసం శోధిస్తున్నప్పుడు సాధారణ బెదిరింపులను అంగీకరించరాదు.. ప్రపంచం ఆమోదయోగ్యం కానిదిగా భావించే వాటిని సమర్థించే ప్రశ్న కూడా ఉత్పన్నం కాకూడదు. ఇది సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి ఖచ్చితంగా వర్తిస్తుంది.. ఒసామా బిన్ లాడెన్‌‌కు ఆతిథ్యం... పొరుగున ఉన్న పార్లమెంట్‌పై దాడి చేసిన దేశానికి నీతులు చెప్పే అర్హత లేదు’’ అని స్పష్టం చేశారు. ఇది సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశానికి కచ్చితంగా వర్తిస్తుందని పాక్‌కు చురకలంటించారు.


2001 డిసెంబరు 13న భారత పార్లమెంట్‌పై పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బహుపాక్షికత అంశంపై భద్రతా మండలిలో బుధవారం మాట్లాడిన పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీనికి ఎస్.జైశంకర్ దీటుగా బదులిచ్చారు. చైనా, పాకిస్థాన్‌లపై తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు. ఉగ్రవాదానికి పాల్పడిన వారిని సమర్థించేందుకు.. వారికి సహాయం చేసేందుకు బహుముఖ వేదికలను దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాగా, ప్రస్తుతం భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తోన్న భారత్ రెండేళ్ల పదవీకాలం ఈ నెలలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో త్రీవవాదంపై పోరాటం, బహుపాక్షికత అంశాలపై జరిగే చర్చలో పాల్గొనడానికి భారత విదేశాంగ మంత్రి మంగళవారమే అక్కడకు చేరుకున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com