చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. అణ్వస్త్ర సామర్థ్యమున్న అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. దీని ద్వారా 5 వేల కి.మీ దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించవచ్చు. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి గురువారం దీన్ని పరీక్షించారు. అగ్ని-5 ద్వారా చైనాలోని చాలా ప్రాంతాలు, సహా ఆసియా మొత్తం, యూరప్ లోని కొన్ని ప్రాంతాల్లో లక్ష్యాలను ఛేదించవచ్చని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా, అగ్ని-1 నుంచి అగ్ని-4 వరకూ క్షిపణులు 700-3,500 కి.మీ లక్ష్యాలను ఛేదిస్తాయి.