పెద్దకడబూరు: భారీ వర్షాల వల్ల, నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగే సిపిఐ రైతు రక్షణ కాలినడక యాత్రకు శుక్రవారం పెద్దకడబూరు నుండి బయలుదేరారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. అలాగే నకిలీ విత్తనాలతో రైతులు పూర్తిగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఖరీఫ్ సీజన్ లో రైతులు బ్యాంకులో తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు మిరప పంటకు, ఉల్లికి 60 వేలు రూపాయలు, ఆముదంకు 40 వేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కర్నూలు వరకు జరుగు రైతు రక్షణ కాలినడక యాత్రకు అధిక సంఖ్యలో మండలంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు హయాత్ పటేల్, హనుమంతు, వీరాంజనేయులు జాఫర్ పటేల్, వీరేష్, తిక్కన్న కార్యకర్తలు పాల్గొన్నారు.