దేశంలో వ్యవసాయంతోపాటు అనేక రంగాల్లో డ్రోన్ పరిజ్ఞానం వినియోగం పెరుగుతున్న దృష్ట్యా డ్రోన్ టెక్నెలజీపై మరింత విస్తృత పరిశోధనలు జరిపేందుకు విశాఖపట్నంలో జాతీయ స్థాయి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వైయస్ఆర్‌సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో సోమవారం జీరో అవర్‌లో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో ఆవిష్కృతమైన అత్యంత కీలక సాంకేతిక పరిజ్ఞానాలలో డ్రోన్ టెక్నాలజీ ఒకటి. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వ్యవసాయం, రక్షణ, రవాణా రంగాలతోపాటు అనేక రంగాలలో డ్రోన్ల వినియోగం బాగా పెరిగింది. డ్రోన్ టెక్నాలజీ, వినియోగంలో దేశం ముందంజలో ఉంది. దీనిని మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా వ్యవసాయ రంగంలో క్రిమిసంహారక మందులు చల్లేందుకు, పొలాల్లో తేమ శాతాన్ని పర్యవేక్షించేందుకు, పంట ఎదుగుదలో వివిధ దశలకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. డ్రోన్ టెక్నాలజీ సాయంతో తక్కువ శ్రమతో రైతులు పంట దిగుబడులను 15 శాతం వరకు పెంచే అవకాశం ఉందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.