సీఎం జగన్ ప్రోద్బలంతోనే మాచర్లలో తమ పా ర్టీ నేతలపై వైసీపీ దాడులకు పాల్పడిందని టీడీపీ నేతలు విమర్శించారు. నెల్లూరు జిల్లా, కావలి టీడీపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో టీడీపీ నేతలు గుత్తికొండ కిశోర్, జ్యోతి బాబూరావు, అన్నపూర్ణ శ్రీను, తటవర్తి వాసు, షేక్ మస్తాన్, యేగూరి చంద్రశేఖర్, దావులూరి దేవకుమార్ మాట్లాడారు. మాచర్లలో టీడీపీ ఇన్‌చార్జి బ్రహ్మారెడ్డి, ఆయన అనుచరులపై ఇళ్లపై, వాహనాలపై దాడులు చేయటం నీచరాజకీయాలకు నిదర్శనమన్నారు. ఏడాది తర్వాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. అప్పుడు చర్యకు ప్రతి చర్య ఉంటుందని వైసీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలన్నారు. మాజీ మంత్రి నారా లోకేష్ పాదయాత్ర ఖరారు కావటంతో వైసీపీ శ్రేణుల్లో వణుకు పుడుతోందన్నారు. రౌడీలు, అవినీతి పరులను వైసీపీ ప్రోత్సహిస్తుందని ఇంత దారుణమైన పాలన గతంలో ఏ ప్రభుత్వంలోనూ చూడలేదన్నారు. టీడీపీ నేతలపైనా, వారి ఇళ్లపైనా దాడులు చేస్తుంటే పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. గవర్నర్ జోక్యం చేసుకుని రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి వాటికి అడ్డుకట్ట వేయించాలన్నారు. సమావేశంలో టీడీపీ నేతలు గుండ్లపల్లి శివాజీ, శాంతకుమార్, రాజా, కోట రమేష్, కత్తి ఆదిశేషయ్య, వేటూరి శివ, అమరజ్యోతి, పసుపులేటి పద్మ, చిట్టాబత్తిన మాల్యాద్రి, అక్కి లగుంట సూర్య ప్రకాష్ పాల్గొన్నారు.