మహిళ అని చూడకుండా వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం హేయమని మాజీ మంత్రి పరిటాలసునీత మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడి అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న రాప్తాడు మండలం బోగినేపల్లికి చెందిన కురుబ నారాయణమ్మను ఆదివారం ఆమె పరామర్శించారు. స్థలం విషయంలో జరిగిన వివాదం, దాడి సంఘటనపై ఆరా తీశారు. రాప్తాడు నియోజకవర్గంలో పరిస్థితులు చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా గూండాల రాజ్యంలో ఉన్నామా అర్థం కావడం లేదన్నారు. వైసీపీఅధికారంలో వచ్చినప్పటి నుంచి చట్టాలు, కోర్టులను లెక్క చేయడం లేదన్నారు. వైసీపీ నాయకులకు తొత్తులుగా మారి పోలీసులే కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. 9.50 సెంట్ల స్థలం విషయంలో 2020 సంవత్సరంలో జిల్లా సివిల్ కోర్టులో ఇంజెక్షన ఆర్డర్ ఉందని, కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ రాప్తాడు పోలీసు స్టేషనలో పంచాయితీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు సివిల్ తగాదాల్లో ఎలా జోక్యం చేసుకుంటారని నిలదీశారు. అధికారులే స్వయంగా కొలతలు వేయించి నారాయణమ్మ స్థలంలో బండలు వేయించడం దుర్మార్గమన్నారు. ఇందుకు అడ్డుచెప్పిన ఆమెపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడితే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకొని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.