గంటకు 150 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే వందేభారత్ సెమీ హై స్పీడ్ రైలు బెజవాడకు అతి త్వరలో రాబోతోంది. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ లో రూపుదిద్దుకుంటున్న వందేభారత్‌లను మలి దశలో దక్షిణాది ప్రాంతాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ, కేంద్ర రైల్వే బోర్డులు నిర్ణయించిన దరిమిలా దక్షిణ మధ్య రైల్వేకు వందేభారత్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అవకాశం దక్కింది. ఈ ఎక్‌ప్రెస్‌ను బెజవాడకు నడపాలని దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది. ఇందుకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జీఎం కూడా ఆమోదముద్ర వేశారని తెలుస్తోంది. విజయవాడ - సికింద్రాబాద్ గోల్డెన్ డయాగ్నల్ రూట్, విశాఖపట్నం - విజయవాడ గోల్డెన్ క్వాడ్రలేట్రల్ రూట్‌లను పరిశీలిస్తున్నారు. ఏ రూట్‌లో నడపాలన్న దానిపై ఇంకా అధికారికంగా స్పష్టత రాలేదు. బెజవాడ - సికింద్రాబాద్ మధ్య కానీ, విశాఖ - విజయవాడ - సికింద్రాబాద్ మధ్య కానీ ప్రవేశ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.