ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆత్మరక్షణకోసం ప్రతిఘటించిన వారు నేరస్థుల్లా కనిపిస్తున్నారా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 19, 2022, 10:00 PM

మాచర్ల మారణహోమంపై పోలీసుశాఖ వ్యాఖ్యలు వింటుంటే, ఖాకీలు ఎంతలా జగన్మోహన్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారో అర్థమవుతోందని టీడీపీ నేతలు మండిపడ్డారు. టీడీపీ చేపడుతున్న ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ’ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే, మాచర్ల కేంద్రంగా ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే పిన్నెల్లి కుట్రలకు తెరలేపారని మాజీమంత్రులు నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర ఆరోపించారు.


మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. సెక్షన్లు, నిబంధనలు టీడీపీవారికే వర్తిస్తాయా? వైసీపీవారికి వర్తించవా అంటే పోలీసుల వద్ద సమాధానంలేదని నక్కా ఆనంద్ బాబు అన్నారు. మాచర్లలో 3 గంటలు మారణహోమం జరిగితే, 2 సీసీటీవీ పుటేజ్ లతో, తప్పంతా టీడీపీదేనని ఎలా నిర్ధారిస్తారు? అని ప్రశ్నించారు. 


“మాచర్ల పట్టణంలో జరిగిన ఘటనపై నిన్న డీఐజీని కలిసి ఫిర్యాదు చేశాం. డీఐజీని కలిసినప్పుడు ఎస్పీ కూడా ఉన్నారు. మాచర్లలో సెక్షన్ 30 అమల్లో ఉందని, మీ పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడు మాకు చెప్పాల్సిందని పోలీసులు అన్నారు. ఫ్యాక్షన్ తగాదాలే మాచర్లలో జరిగిన దారుణాలకు కారణమని ఎస్పీ అడ్డగోలుగా మాట్లాడాడు. ఆ ప్రాంతంలో ఫ్యాక్షన్ సమసిపోయి 2 దశాబ్దాలు దాటిందని ఎస్పీకి  తెలియదా? వైసీపీ వారిని ఎస్పీ సమర్థిస్తున్నాడు. బ్రహ్మారెడ్డిపై హత్యాయత్నం కేసుపెట్టారు. మరి ఎమ్మెల్యే సోదరుడిపై ఎందుకు కేసు పెట్టలేదు? తురకా కిశోర్, ఇతర వైసీపీ నేతలు, కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు ఎందుకు పెట్టలేదో పోలీసులు చెప్పాలి" అని నిలదీశారు.


కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ఆత్మరక్షణకోసం ప్రతిఘటించిన వారు నేరస్థుల్లా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. “మా నాన్నకు, నాకు ఉన్న ఫ్యాక్షన్ స్వభావం నా కొడుక్కి వచ్చిందని గతంలో రాజశేఖర్ రెడ్డి అన్నదాన్ని ఇప్పుడు జగన్ నిజం చేస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ‘ఇదేంఖర్మ-మనరాష్ట్రానికి’ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో, ముఖ్యమంత్రి, వైసీపీ నేతలకు నిద్రపట్టడంలేదు. 


వైసీపీ ప్రభుత్వం వచ్చాక పల్నాడులో రక్తపుటేరులు పారాయి. మాచర్ల ఇన్ ఛార్జ్ గా బ్రహ్మారెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే బీసీ నేత చంద్రయ్యని కిరాతకంగా హతమార్చారు. కోడిని కోసినట్టు నడిరోడ్డుపై అతని గొంతుకోశారు. చంద్రయ్య సహా, పల్నాడువ్యాప్తంగా 16మంది టీడీపీనేతల్ని జగన్ రెడ్డి బలితీసుకున్నాడు. మాచర్ల మారణహోమంపై డీఐజీ, పల్నాడు ఎస్పీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.  వారి వాదననే గుడ్డిగా డీజీపీ సమర్థిస్తున్నాడు. ఏం ప్రమాణంచేసి, వంటిపై ఖాకీ దుస్తులు వేసుకున్నారో పోలీసులు చెప్పాలి.


రైల్వే గేట్ పడకపోయిఉంటే, బ్రహ్మారెడ్డి ప్రాణాలకే ప్రమాదం జరిగేది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి గతంలో మాచర్లలో టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్నలపై దాడిచేయించారు. టీడీపీ నేతలపై దాడిచేసినందుకు మెచ్చి తురకా కిశోర్ ని మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ ని చేశారు. దానర్థం మరిన్ని దాడులు చేయమని, హత్యా రాజకీయాలు చేయమని ప్రోత్సహించడం కాదా? జోగి రమేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లాడని, ముఖ్యమంత్రి అతనికి మంత్రిపదవి ఇచ్చాడు. ఇదే రాష్ట్రంలో అమలవుతున్న జగన్ రెడ్డి ప్రజాస్వామ్యం" అంటూ కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com