ప్రభుత్వంపై దుష్ట చతుష్టయం చేస్తున్న విష ప్రచారాన్ని పార్టీ కార్యకర్తలు, నాయకులు తిప్పి కొట్టాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. ఇప్పిలి గ్రామంలో మంత్రి ధర్మాన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల పరిషత్ నిధులు నుంచి రు.5 లక్షలు కేటాయిస్తూ కనుగుల వాని పేట నుంచి ఇప్పిలికి రోడ్డు వేసేందుకు అనుమతులను మంత్రి ధర్మాన మంజూరు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తూ ఉన్న మంచి పనుల వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. ఓ రాజకీయ పార్టీ కార్యకర్తగా ఉన్న వారు ఇటువంటి విష ప్రచారాలను తిప్పి కొట్టాలన్నారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారంటే.. మార్పు గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీరంతా ఈ మూడున్నరేళ్ల కాలంలో వచ్చిన మార్పులు గమనించారు. అలానే ఓట్లు అడిగేందుకు కూడా ఇక్కడికి రాలేదు. ఎందుకంటే గతంలో కూడా మీరు నన్ను ఆదరించారు. ఇప్పుడూ ఆదరిస్తున్నారు. ఇప్పిలి గ్రామం నా గెలుపునకు ఉపయోగపడుతోంది. ఎప్పుడు అవకాశం వచ్చినా మీ రుణం తీర్చుకుంటాను అని అన్నారు.