ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఎనిమిదేళ్ళు కావస్తున్నా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న ఆస్తుల పంపకాల సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని వైయస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. విభజన చట్టం ప్రకారం న్యాయసమ్మతంగా, ధర్మబద్దంగా, త్వరితగతిన ఆస్తుల పంపిణీ సమస్యను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని విజ్ఞప్తులు చేసినా పరిష్కారం పట్ల కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపకుండా ఏళ్ళ తరబడి సాచివేత ధోరణి అనుసరిస్తూ వస్తోంది. దీంతో విసిగిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం ఆస్తుల పంపిణీ జరపాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఈ పరిస్థితికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే కారణం. ఆనాడు అడ్డగోలుగా, ప్రజాస్వామిక పద్ధతిలో యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించి ఏపీకి అన్యాయం చేస్తే ఈనాడు విభజన సమస్యల పరిష్కారం విషయంలో ఎన్డీయే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు క్రియారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆయన విరుచుకు పడ్డారు. ద్రవ్య వినిమయ బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఒకవైపు రాష్ట్రాలకు చెల్లించే జీఎస్టీ పరిహారాన్ని నిలిపివేస్తోంది. మరోవైపు ఆంధ్రా, తెలంగాణ మధ్య ఆస్తులు, ఆర్థిక వనరుల పంపిణీ సమస్యలను పరిష్కారానికి కృషి చేయకుండా కేంద్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నందు వలన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సమస్యలతో సతమమతం అవుతోందని అన్నారు.