వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా సోమవారం అట్టహాసంగా క్రీడా పోటీలు ప్రారంభించారు. ఆయా మండల కేంద్రాల్లో కబడ్డీ, క్రికెట్, ఖోఖో, వాలీబాల్, బాడ్మింటన్ పోటీలను వైయస్ఆర్‌సీపీ నాయకులు నిర్వహించారు. నంద్యాల జిల్లా వెలుగోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను పార్టీ మండల అధ్యక్షుడు అంబాల ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరమని, క్రీడల వల్ల మానసికొల్లాసం కలుగుతుందని అన్నారు. విద్యార్థి దశలో చదువుతోపాటు క్రీడలపై సైతం దృష్టి సారించాలన్నారు. క్రీడల్లో రాణించడం ద్వారా మంచి భవిష్యత్ పొందొచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహకాన్ని అందజేస్తుందన్నారు. పాఠశాల స్థాయిలో జరిగే ఇటువంటి పోటీలు విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీస్తాయన్నారు. ఇటువంటి అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.