వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట్లాడిన పవన్.. సన్యాసం తీసుకోకుండా ఇప్పుడు రాష్ట్రంలో ఎందుకు తిరుగుతున్నాడని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో పవన్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వకుండా ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారన్నారు. విజయవాడలో మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ వీకెండ్ రాజకీయాలు చేస్తున్నారని, సినిమా షూటింగ్ గ్యాప్‌లో ఏపీకి వచ్చి వేళ్లు, చెప్పులు చూపిస్తే జనం ఆదరించరన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ప్రజలకు ఫుల్‌టైమ్ అందుబాటులో ఉండాలని, వీకెండ్‌లో ఏపీకి వస్తే.. ప్రజలు టూరిస్టుగానే చూస్తారన్నారు. చంద్రబాబు, పవన్‌కు రాష్ట్రంలో ఓటు, ఇల్లు, అడ్రస్ ఉందా..? అని ప్రశ్నించారు. బీసీ గురించి మాట్లాడే అర్హత పవన్, చంద్రబాబుకు లేదని మంత్రి రోజా అన్నారు. పవన్ నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పవన్‌ను, ఆయన వారాహి వాహనాన్ని పట్టించుకునే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాశనం చేసినప్పుడు పవన్ ఏం చేశాడు..? పోలవరంపై చంద్రబాబును పవన్ ఏనాడైనా ప్రశ్నించాడా..? ప్రశ్నించకుండా గతంలో గాడిదలు కాశాడా..? అని పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా ఫైరయ్యారు.