‘‘మన ప్రభుత్వం నియమించిన వలంటీర్లను మన పార్టీ కోసం వాడేద్దాం. ప్రతి పాతిక ఇళ్లకు ఒక గృహసారథిని నియమిస్తాం. వలంటీర్ల సేవలన్నీ వారి ఆధ్వర్యంలోనే జరగాలి. వచ్చే ఆర్నెల్లలో గృహసారథులు...కుటుంబాలతో మమేకమవుతారు. జనాలకందుతున్న ప్రభుత్వ ప్రయోజనాలన్నీ వారి చేతులమీదుగానే జరగాలి. సచివాలయాల వేదికగానే ఎన్నికల కసరత్తు ఉంటుంది. ఈసారి మళ్లీ మన ప్రభుత్వంఅధికారంలోకి రావాలి. అందుకోసం ప్రభుత్వ పరపతిని ఉపయోగించుకుందాం’’ అంటూ గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వ పెద్దలు సంకేతాలిస్తున్నారు. అవ్వాతాతలకు పింఛన్లు మొదలు ప్రతి ప్రభుత్వ పథకమూ ఇప్పటివరకు గ్రామ, వార్డు సచివాలయాల వలంటీర్ల ద్వారా ప్రభుత్వం.. ప్రజలకు చేరుస్తోంది. ఇక నుంచి ఈ సేవలను గృహసారథుల పర్యవేక్షణలో అందిస్తూ, గరిష్ఠంగా పార్టీ ప్రయోజనం పొందేలా వైసీపీ అధిష్ఠానం పక్కా ప్రణాళిక వేసిందన్న అనుమానం వ్యక్తమవుతోంది. అందులోభాగంగానే గృహసారథులకు వలంటీర్లు సహకరించాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్టు చెబుతున్నారు.