నీళ్లు ఎంత తాగితే అంత మంచిదంటూ కొందరు అదే పనిగా తాగేస్తుంటారు. మోతాదుకు మించి నీటిని తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. శరీరానికి ఎంత నీరు అవసరమో అంతే తాగాలి. అతిగా నీరు తాగడం వల్ల ఆ నీటిని వడబోసే శక్తి గానీ, నిల్వ ఉంచుకునే సామర్థ్యం గాని కిడ్నీలకు ఉండదు. అప్పుడు అధిక నీరు రక్తంలో కలిసిపోతుంది. శరీరంలో ఉండే ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతింటుంది. శరీరంలోని సోడియం ప్రమాణాలు పడిపోతాయి. దీంతో హృదయ సమస్యలు వచ్చే అవకాశం అధికం అవుతుంది. తలనొప్పి, తలతిరగడం, డయేరియాలాంటి సమస్యలూ రావచ్చు. అంతేకాకుండా అధిక మోతాదులో నీళ్లు తీసుకోవడం వల్ల మెదడు కూడా ప్రభావితం అవుతుంది. మూర్ఛ రావడం, లేదా కోమాలోకి వెళ్లడంలాంటివి కూడా జరగవచ్చు.