మంత్రి అంబటిని వెంటనే బర్తరఫ్ చేయాలని టీడీపీ రాష్ట్ర వడ్డెర సాధికార కన్వీనర్ వడ్డె వెంకట్ బుధవారం డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ చేతికి అంది వచ్చిన కుమారుడిని కోల్పోయి ఆ కుటుంబం పుట్టెడు శోకంలో కొట్టుమిట్టాడుతోందని తెలిపారు. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబానికి ప్రభుత్వం ఐదు లక్షలు మంజూరు చేసిందని, బాధితులకు చెల్లించాల్సిన మొత్తంలో సగం నాకు ఇవ్వాలని మంత్రి అంబటి రాంబాబు, మున్సిపల్ చైర్ పర్సన్ భర్త సాంబశివరావు డిమాండ్ చేశారని తాను సంతకం చేస్తేనే మీకు 5 లక్షల రూపాయలు మంజూరు అయిందని మొత్తంలో సగం అంటే రెండున్నర లక్షలు ఇవ్వాల్సిందేనని మంత్రి చెప్పడంతో ఆ వడ్డెర కుటుంబం నిర్గాంత పోయిందన్నారు.
శవాలపై పేలాలు ఏరుకునే రకం వైకాపా నాయకులదని అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు ప్రమాదవశాత్తు మృతి చెందితే ఆ కుటుంబానికి అండగా ఉండాల్సింది పోయి వారికి వచ్చిన పరిహారంలో సగం ఇవ్వమని డిమాండ్ చేయడం చాలా దుర్మార్గమని పేర్కొన్నారు. ఇంతటి నీచానికి ఒడిగట్టిన మంత్రి అంబటి రాంబాబును మంత్రివర్గం నుంచి తక్షణమే భర్తరఫ్ చేయాలని వడ్డే వెంకట్ డిమాండ్ చేశారు. ఇలాంటి అవినీతిపరులను పెంచి పోషిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని తెలిపారు. వైకాపా నాయకుల వైఖరికి సమాజం సిగ్గుతో తలదించుకొంటోందని విమర్శించారు. బాధిత వడ్డెర కుటుంబానికి న్యాయం జరిగే వరకూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వడ్డెర సంఘాలతో కలిపి ఆందోళన నిర్వహిస్తామని వడ్డే వెంకట్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.