రూ.300 టోల్ ను ఆదా చేయడం కోసం ఓ కారు డ్రైవర్ ఒక టోల్ ఉద్యోగి ప్రాణం తీసేందుకు సిద్ధపడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని జలోర్ జిల్లాలో జరిగింది. జలోర్-బార్మెర్ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్దకు సోమవారం రాత్రి ఓ కారు వచ్చింది. టోల్ ఉద్యోగి డబ్బు వసూలు చేయడం కోసం ఓ కర్రను కారుకు అడ్డుపెట్టాడు. అయితే కారు డ్రైవర్ కారును ఆపకుండా వేగంగా వెళ్లాడు. మొదట ఆ కారు అతివేగంగా వెళ్లి ఓ స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం టోల్ ఉద్యోగిని ఢీకొట్టింది. అయినా కారు డ్రైవర్ కారును ఆపలేదు. కొంతదూరం వెళ్లాక కారును ఆపాడు. డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పారిపోయాడు. కారు కింద ఇరుక్కున్న టోల్ ఉద్యోగికి త్రీవ గాయాలయ్యాయి. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.