కొరిశపాడు మండలంలోని తాసిల్దార్ కార్యాలయం ఆమ్యామ్యాలకు నిలయంగా మారింది. చెయ్యి తడపందే ఫైలు ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. చివరికి సర్టిఫికెట్ కోసం సంతకం పెట్టాలన్న ఆ అధికారికి తాంబూలం అందిస్తే తప్ప పని జరగని పరిస్థితి ఏర్పడటంతో ప్రజలు విసిగెత్తిపోతున్నారు. కిందిస్థాయి అధికారులు పనిచేస్తున్నప్పటికీ ఆ అధికారి సంతకానికి డిమాండ్ ఉండటంతో చేసేదేమీ లేక చెయ్యి తడిపి పనిచేపిచ్చుకుంటున్నారు. ఆ అధికారికి చెయ్యి తడపకపోతే కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా ప్రదక్షిణలు చేయవలసిన దుస్థితి ఏర్పడింది. మచ్చుకైనా మచ్చ లేకుండా తాసిల్దార్ పనిచేస్తుంటే ఆ అధికారి తీరుతో మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా ఆ అధికారి ఆగడాలకు ఉన్నతాధికారులు కళ్లెం వేయాలని పలువురు ప్రజలు కోరుతున్నారు.