అదనపు కట్నం కోసం వేధింపులు, గృహహింస భరించలేక ఎలకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసిన బల్లికురవ మండలం వల్లాపల్లి గ్రామానికి చెందిన వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఫిర్యాదు అందడంతో గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై వేమన కథనం ప్రకారం పల్నాడు జిల్లాకు చెందిన షేక్ ఫాతిమాను వల్లపల్లికి చెందిన ఖాసింవలీకి ఇచ్చి వివాహం చేశారు. అయితే భర్త అత్తమామలు, అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా ఆమె శీలాన్ని శంకించి గృహహింసలకు గురి చేశారు. దీంతో ఫాతిమా ఈ నెల 13వ తేదీన తన ఇంట్లోఎలకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం తెలిసి ఆమె తల్లి జానీబీ వచ్చి ఫాతిమాను చికిత్స నిమిత్తం తనతో తీసుకువెళ్లి పిడుగురాళ్లలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించింది. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ఫాతిమా మృతి చెందింది. ఆ మేరకు జానీబీ గురువారం ఫిర్యాదు చేయగా ఆమె అల్లుడు, మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వేమన చెప్పారు.