కైకాల సత్యనారాయణతో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే కైకాల మరణ వార్త వినగానే చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, నవరస నటనా సార్వభౌముడు సత్యనారాయణగారి మృతి తనను కలచి వేస్తోందని చిరంజీవి అన్నారు. ఆయన పోషించినటువంటి వైవిధ్యభరితమైన పాత్రలను భారతదేశంలో మరెవరూ పోషించి ఉండరని చెప్పారు. ఆయనతో కలిసి తాను ఎన్నో చిత్రాలలో నటించానని, ఆ సందర్భంగా ఆయన వ్యక్తిత్వాన్ని దగ్గర నుంచి పరిశీలించే అవకాశం తనకు కలిగిందని అన్నారు.
డైలాగ్ డెలివరీలో ఆయనది ఒక ప్రత్యేకమైన పంథా అని చెప్పారు. స్వచ్ఛమైన స్పటికంలాంటి వ్యక్తి అని, నిష్కల్మషమైన మనసున్న మనిషని కొనియాడారు. తనను తమ్ముడూ అంటూ తోడబుట్టినవాడిలా ఆదరించారని చెప్పారు. తమ మధ్య ఆత్మీయతానుగారాలు అంతకంతకూ బలపడుతూ వచ్చాయని అన్నారు. ఆయనతో తనకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పారు.
నటనతో పాటు రుచికరమైన భోజనం అన్నా సత్యనారాయణగారికి చాలా ఇష్టమని చిరంజీవి తెలిపారు. తన శ్రీమతి సురేఖ చేతి వంటలంటే ఎంతో ఇష్టపడేవారని చెప్పారు. ఈ ఏడాది ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం తనకు మిగిలిన సంతృప్తి అని అన్నారు. ఆయన ఇంటికి వెళ్లిన సందర్భంగా 'అమ్మా సురేఖా, ఉప్పుచేప వండి పంపించు' అని అన్నారని... మీరు త్వరగా కోలుకోండి, ఉప్పు చేపతో మంచి భోజనం చేద్దామని తాము అన్నామని గుర్తు చేసుకున్నారు. ఆ క్షణాన ఆయన చిన్న పిల్లాడిలా ఎంతో సంబరపడిపోయారని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa