సి. పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో పుస్తకాల నిర్వహణ, ప్రాచీన రాతప్రతులను భద్రపరచడం, అన్నిరకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను అందుబాటులో ఉంచడం, విశ్వవిద్యాలయాల్లో పరిశోధన చేసే పరిశోధకులకు తోడ్పడే సిద్ధాంత గ్రంథాలను, ప్రత్యేక సంచికలను ఉపయుక్తంగా ఉంచడం, నిరంతరం సాహిత్య కార్యక్రమాలను నిర్వహించడం, గ్రంథాలయాన్ని పరిశుభ్రంగా ఉంచడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు పి. విజయబాబు పేర్కొన్నారు.
సోమవారం యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి. పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రాన్ని పి. విజయబాబు సందర్శించారు. ముందుగా ఆయన గ్రంథాలయ ప్రాంగణంలోని సి. పి. బ్రౌన్, డా॥ జానమద్ది హనుమచ్ఛాస్త్రి, సి. కె. సంపత్ కుమార్ విగ్రహాలకు పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సి. పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో ఉన్న బ్రౌన్ రచనలను, మెకంజీ కైఫియత్తులను, తాళపత్ర గ్రంథాలను, తామ్రపత్రాన్ని, చేతితో తయారు చేసిన కాగితాలను, కేంద్రం ముద్రించిన గ్రంథాలను చూసి హర్షం వ్యక్తం చేశారు. సంచాలకులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి, సి. పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సలహామండలి సభ్యులు జానమద్ది విజయ భాస్కర్, గ్రంథాలయ సిబ్బంది కలసి పి. విజయబాబును శాలువతో సత్కరించి, గ్రంథాలయ ప్రచురణలను బహూకరించారు. డా. చింతకుంట శివారెడ్డి, ఎన్. రమేశ్ రావు, ఆర్. వెంకటరమణ, పలువురు పాఠకులు పాల్గొన్నారు.