జన్మనిచ్చిన తల్లి ప్రాణాలతో లేదు. తన జన్మకు కారణమైన తండ్రికి మానవత్వం లేదు. మృత్యువు అంచులవరకు వెళ్లి ఒక మానవత్వం కలిగిన మహిళ చొరవతో ప్రాణం పోసుకుని పిల్లల సంరక్షణా కేంద్రానికి చేరుకుంది. మూడు రోజుల పసికందును కన్నతండ్రి ముళ్లపోదల్లో వదిలి వెళ్లిన హృదయ విదారకర సంఘటన సోమవారం జాతీయ రహదారి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దొనబండ వద్ద జరిగింది. పూర్తి వివరాలు ప్రకారం మచిలీపట్నానికి చెందిన మహమ్మద్ షాబాజ్, గుడివాడకు చెందిన ఓ యువతీ, యువకులు హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తూ సహజీవనం చేస్తున్నారు. ఆ యువతి ఈ నెల 23న హైదరాబాద్ మోడరన్ ఆసుపత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ తరువాత మూర్చ రావడంతో ఉస్మానియాలో చికిత్స పొందుతూ మృతిచెందింది. మహమ్మద్ ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో గుడివాడ తీసుకువస్తూ మార్గమధ్యం దొనబండ వద్ద జాతీయ రహదారి పక్కన ముళ్లపొదల్లో మూడు రోజుల పసికందును వదిలి వెళ్లిపోయాడు. స్థానికంగా గాజులు అమ్ముకునే ముంతాజ్ అనే మహిళ పసికందును చూసి అక్కున చేర్చుకుంది. ఈ క్రమంలో కొందరు పసికందును పెంచుకునే విషయంలో ఘర్షణ పడటంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పసికందును గన్నవరం దగ్గర బుద్దవరం పిల్లల సంరక్షణా కేంద్రానికి ఆశ, ఎఎన్‌ఎంల సాయంతో తరలించి అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి మహమ్మద్ షాబాజ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించింది.