ఏకంగా నెల రోజుల పాటు 57 మంది రోహింగ్యా శరణార్థులు సముద్రంలో చిక్కుకుపోయారు. పొట్ట చేత పట్టుకొని పొరుగు దేశాలకు వలస వెళ్లేందుకు సముద్ర మార్గంలో బయలు దేరిన వీరు పడవ ఇంజిన్ పనిచేయక పోవటంతో నడి సముద్రంలోనే ఉండిపోయారు. అలా నెల రోజుల పాటు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక అల్లాడిపోయారు. గాలులతో అటూఇటూ కొట్టుకుపోయిన పడవ, చివరకు ఇండోనేషియాలోని అషే బేసర్ తీరానికి చేరుకుంది. అన్నిరోజులు సముద్రంలో చిక్కుకుపోవడంతో వాళ్లు ఆహారం లేక బలహీనంగా మారారని, డీహైడ్రేషన్ బారిన పడ్డారని ఇమ్మిగ్రేషన్ అధికారులు చెప్పారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించామన్నారు. ప్రస్తుతం ఈ శరణార్థులను ప్రభుత్వ ఆవాసంలో తాత్కాలికంగా స్థావరం కల్పించామని చెప్పారు. కాగా పడవ తీరం తాకిన వెంటనే ఆర్తనాదాలు చేస్తూ వారంతా బయటకి వచ్చిన దృశ్యాలు హృదయాలను మెలిపెడుతున్నాయి.