రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి నవరత్నాలు - ద్వైవార్షిక నగదు మంజూరు కింద అర్హులై ఉండి లబ్ది అందని వారికి లబ్ధి అందించడంలో భాగంగా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఒక్కళిగ కార్పొరేషన్ చైర్పర్సన్ నళిని, ఏడిసిసి బ్యాంక్ చైర్ పర్సన్ లిఖిత, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఓబుళపతి, హుడా చైర్మన్ లక్ష్మీనరసమ్మ, పుట్టపర్తి ఎంపిపి రమణా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తశుద్ధితో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారన్నారు. ఇంతకుముందు ఎప్పుడు అమలు చేయని విధంగా జగనన్న అమ్మఒడి, వైయస్సార్ కాపు నేస్తం, వైయస్సార్ నేతన్న నేస్తం, వాహన మిత్ర, వైయస్సార్ చేయూత, ఈ బీసీ నేస్తం, జగనన్న చేదోడు, వైయస్సార్ మస్త్య భరోసా, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెనలాంటి అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోందన్నారు. అవినీతికి, కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పూర్తిస్థాయిలో లబ్ధి చేకూరుస్తున్నట్లు తెలిపారు. అర్హులై ఉండి పొరపాటున ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం కల్పించి నవరత్నాలు - ద్వైవార్షిక నగదు మంజూరు కింద ఈరోజు లబ్ధి చేకూర్చడం జరిగిందన్నారు.